మిగతా దేశాలతో పోల్చుతూ దేశ భద్రతను ఆగం చేస్తున్నారని.. మోదీ చదువుకోక పోవడం వలన ఇలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలవడం లేదని.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఉంటుందన్నారు. యుద్ధం, శాంతి భద్రతలు, ఆస్తుల పరిరక్షణకు వేరు వేరుగా సిబ్బంది ఉంటారని.. ఆర్మీ జవాన్లను యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారని ఆయన అన్నారు.
నాలుగు సంవత్సారాలు తర్ఫీదు ఇచ్చి బయటకి వదిలితే ఉద్యోగాలు లేకపోతే ఎటు వెళతారని ప్రశ్నించారు. మిగతా దేశాలలో ఆర్మీ నుండి బయటకి వచ్చిన తరువాత ఉద్యోగ భద్రత ఉంటుందని.. కానీ ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు. దేశంలో నిరుద్యోగం ఆకాశానికి అంటుతుందని విమర్శించారు. 4 యేళ్లు తర్ఫీదు పొంది బయటకి వచ్చిన తరువాత ఉద్యోగం లేకపోతే.. బయటకి వెళ్ళే అవకాశం ఉంటుంది.. దాని వల్ల దేశానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. అగ్ని పథ్, అగ్ని వీర్ ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ పరిధిలలో నిరసన సత్యాగ్రహ దీక్షలు చేపడుతామని అన్నారు.