నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోంది : రేవంత్ రెడ్డి
తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 9 Oct 2023 9:57 AM GMTతెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందని.. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నారు. రాబోయే విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవాలని.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని పేర్కొన్నారు. లక్ష కోట్లు, పదివేల ఎకరాల భూములను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు. అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని.. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చిందన్నారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. డిసెంబర్ లో అద్భుతం జరగబోతుంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోష్యం చెప్పారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబికులు శ్రీమంతులు అయ్యారు తప్ప.. ప్రజలకు ఒరిగిందేం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 రాబోతున్నాయి. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందజేయబోతున్నాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నాం. ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15వేలు అందించనున్నాం అని వరాల జల్లు కురిపించారు.
సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానం అన్నారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందన్నారు. అందుకే స్థాయి లేకపోయినా సోనియా, రాహుల్ ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. బిల్లా-రంగాలకు సూటిగా సవాల్ విసురుతున్నా.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధం.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో చర్చకు రండి అన్నారు. తేదీ చెప్పండి.. అమరవీరుల స్థూపం వద్ద చర్చకు మేం సిద్ధం అని సవాల్ విసిరారు.
డిసెంబర్ 9, 2023న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ తొలి సంతకం అన్నారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. వారు ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే బీజేపీ ప్రయత్నమన్నారు. 2018లోనూ బీజేపీ చేసింది ఇదేనన్నారు. బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకే బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందని అన్నారు.