బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు.. భస్మాసుర సమితి
Revanth Reddy Fire On CM KCR. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 9 Jan 2023 10:17 AM GMTరాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సర్పంచుల నిధులు, విధుల పరిష్కారం కోరుతూ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఖరితో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి నెలకొందని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని.. అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని తెలిపారు.
ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలి. సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని అన్నారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాలని కోరారు. సర్పంచులకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోందని ఆరోపించారు. నిధులు రాకపోవడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో 60మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే సర్పంచుల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెట్టు చనిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తారట.. మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల మూసీలో మునిగి 30 మంది చనిపోయారని అన్నారు.హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు
లేవు. మునిసిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని ధ్వజమెత్తారు.పుట్టబోయే బిడ్డమీద కూడా 1లక్షా 50వేల అప్పు వేశారని విమర్శించారు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు.. భస్మాసుర సమితి అని అన్నారు. బుద్ది మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపాడలేదని అన్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు ఎక్కడైనా కట్టించారా? అని ప్రశ్నించారు.
నీ సోకులకు వేల కోట్లు ఖర్చు చేస్తూ.. సర్పంచుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారా? నిలదీశారు. సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి.. బీఆరెస్ ను బొంద పెట్టాలి అని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటేదాక తరమాలని అన్నారు. పనికిమాలిన చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని అన్నారు. సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తామన్నారు.
సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశాని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అడుక్కోవడం మానండి.. కోట్లాది సాధించుకుందాం అని సర్పంచులనుదేశించి అన్నారు. కేసీఆర్ దోపీడీని నిలువరించేందుకు సర్పంచులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సర్పంచులకు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అధికారం పోవాల్సిందేనని అన్నారు.