ప్ర‌ధాని మోదీ తెలంగాణ అస్థిత్వాన్ని తప్పుపడుతుంటే.. కేసీఆర్ ఎక్కడ.? : రేవంత్

Revanth Reddy Fire On CM KCR. ప్రధాన మంత్రి కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాలను

By Medi Samrat  Published on  8 Feb 2022 11:14 AM GMT
ప్ర‌ధాని మోదీ తెలంగాణ అస్థిత్వాన్ని తప్పుపడుతుంటే.. కేసీఆర్ ఎక్కడ.? : రేవంత్

ప్రధాన మంత్రి కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమభావంతో చూడాలని.. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అలా లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 1200 మందిని బలితీసుకున్నది బీజేపీయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు, వ్యతిరేక భావంతో మాట్లాడారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 'మీరు మేనేజ్‌మెంట్ ద్వారా ఈ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. మీరు ఏరోజు కూడా ప్రజాఉద్యమాలు నిర్మించి ప్రధానిగా ఎదగలేదు. మీ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో కొందరిని మభ్యపెట్టి ప్రధాన మంత్రి అయ్యారని విమ‌ర్శించారు.

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ కాకినాడలో తీర్మానం చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సాక్షిగా ఉన్నారు. ఎల్.కె.అద్వానీ నాయకత్వం ఉన్నప్పుడు ఆ తీర్మానం చేసింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకుంది. నాడు తెలంగాణలో నాలుగు స్థానాలు గెలిచారు. 1999లోనే బీజేపీకి తెలంగాణలో 4 స్థానాలు ఇచ్చారు. 1999లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే తెలంగాణను మోసం చేసింది. 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉండి మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కానీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణను అవమానించింది. చిన్నచూపు చూసింది. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు.

1998లో కాకినాడలో చేసిన తీర్మానాన్ని తుంగలో తొక్కింది. అనేకమంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. బీజేపీ దానికి బాధ్యత వహించాలి. మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ తీర్మానం అమలు చేసి ఉంటే 1200 మంది విద్యార్థులు ప్రాణం తీసుకోకపోయేవారు. వారి ప్రాణాలు తీసుకున్నది బీజేపీయే. ఇప్పటికైనా నరేంద్ర మోదీ క్షమాపణలు కోరాలని రేవంత్ అన్నారు. విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నది బీజేపీయేనని ప్రకటించి క్షమాపణలు కోరాలి.. కానీ ఈరోజు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని అథమ స్థాయిలో మాట్లాడుతున్నారని.. ఇంత దిగజారి మాట్లాడిన ప్రధానిని ఈ దేశం ఎప్పుడూ చూడలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రెండు రోజులుగా మోదీ పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్ముతున్నారని రేవంత్ విమ‌ర్శించారు. పార్లమెంట్ లో మోదీ తెలంగాణ పై విషం చిమ్ముతుంటే టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటని రేవంత్ ప్ర‌శ్నించారు. మోదీ తెలంగాణ అస్థిత్వాన్ని తప్పుపడుతుంటే కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారని నిల‌దీశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను మోదీ కించపరుస్తుంటే.. కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమం, ప్రాణ త్యాగాలను మోదీ అవమానిస్తుంటే.. కేంద్రంపై యుద్ధం చేస్తానని పదే పదే చెప్పే కేసీఆర్ ఏ ఫాంహౌస్ లో సేదతీరుతున్నార‌ని ప్ర‌శ్నించారు.


Next Story