10 లక్షల మందితో భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకున్నా వాయిదా వేసేది లేదు : రేవంత్
దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Sep 2023 12:29 PM GMTదేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. విజ్ఞప్తి మేరకు CWC సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసిందని మండిపడ్డారు. మనమంతా 16, 17, 18 మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రేపు సాయంత్రం కేసీ వేణుగోపాల్ వచ్చి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహిద్దామని పేర్కొన్నారు. 17న సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్ 2న డిఫెన్స్ వారికి లేఖ ఇచ్చామని వెల్లడించారు.
కానీ మనకు పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో సభ పెడతామంటూ కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసి ఈ కుట్రను తిప్పికొట్టాలని.. ప్రభత్వమే కుట్రదారుగా మారడం దారుణం అన్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రెండవ అప్షన్ గా ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.
అయినా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదని అన్నారు. ఔటర్ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 17న సోనియాగాంధీ ఇచ్చే 5 గ్యారంటీలను 18 నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటున్నాం. 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.