సర్వేలలో మూడో స్థానం రావడంతో చలి జ్వరం వచ్చింది

Revanth Reddy Fire On BJP TRS. మునుగోడులో జరుగుతున్న ప్రచార సరళిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని

By Medi Samrat  Published on  26 Oct 2022 1:11 PM GMT
సర్వేలలో మూడో స్థానం రావడంతో చలి జ్వరం వచ్చింది

మునుగోడులో జరుగుతున్న ప్రచార సరళిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు కొత్తవారు కాదని.. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారేన‌ని.. నిజంగా వారు మునుగోడును అభివృద్ధి చేయాలనుకుంటే మునుగోడు పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. వారికి మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఇంకో ఎనిమిదేళ్లయినా డిండి ప్రాజెక్టును పూర్తి చేయలేరు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గిరిజనుల భూములను సినిమా వాళ్లకు కట్టబెట్టాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.

గిరిజనులను అనాధలను చేయాలనే కుట్ర జరుగుతోంది. సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ, టీఆర్ఎస్ లు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చదువుకోవాల్సిన పిల్లలను మద్యానికి బానిసను చేస్తున్నారు. యువతను తాగుబోతులుగా మారుస్తున్నారు. మద్యం, డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ లు కాంగ్రెస్ ను చంపాలని చూస్తున్నాయి. మునుగోడుకు తరలి వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా నిలవండని రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సర్వేలలో బీజేపీకి మూడో స్థానం రావడంతో రాజగోపాల్ కు చలి జ్వరం వచ్చిందని.. టీఆర్ఎస్‌, బీజేపీ కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 30న షాద్ నగర్ కు జోడో యాత్ర చేరుకుంటుంది. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న మునుగోడు మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు మహిళా గర్జన ఉంటుంద‌ని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు మహిళా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. రేపు ఉదయం మక్తల్ లో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. 27 నుంచి నవంబర్ 7 వరకు భారత్ జోడో యాత్ర సాగుతుందని.. తెలంగాణ బిడ్డలుగా ఒక్కరోజైనా రాహుల్ పాదయాత్రలో పాల్గొనండని పిలుపునిచ్చారు.


Next Story