వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలి

Revanth Reddy Fire On BJP and TRS. టీఆర్ఎస్, బీజేపీ ల‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు.

By Medi Samrat  Published on  24 Aug 2022 3:17 PM IST
వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలి

టీఆర్ఎస్, బీజేపీ ల‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై ఆయన ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరిస్తున్నాయని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడానికి టీఆర్ఎస్‌ కృత్రిమంగా సృష్టిస్తున్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని ఆయ‌న అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. రాజాసింగ్‌ ఓ వర్గాన్ని రెచ్చగొట్టారంటూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఈ విష‌య‌మై బీజేపీ అధిస్టానం రాజా సింగ్‌ను సస్పెండ్ కూడా చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపించిన సంగతి తెలిసిందే..! ఇవన్నీ ఆరోపణలని.. కేవలం తన తండ్రి మీద భారతీయ జనతా పార్టీ అక్కసు తీర్చుకోడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని.. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ అంశంపై కూడా రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు అధికార టీఆర్ఎస్‌పై భ‌గ్గుమంటున్నాయి.


Next Story