Revanth Reddy : కటాఫ్ మార్కుల గురించి కేటీఆర్ కు ఎలా తెలుసు.?
Revanth Reddy complained to ED about TSPSC paper leakage. టీఎస్‌పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat
Revanth Reddy complained to ED about TSPSC paper leakage
టీఎస్‌పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలోఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా.. కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదని అన్నారు. ఇంత జరిగాక నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నాం.. కానీ సిట్ తో కేసులు వేయించి మా విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు అని విమర్శించారు.
పేపర్ లీకేజ్ లో నేరమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలని డిమాండ్ చేశారు. కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించాం.. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.. ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశామని తెలిపారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి.. కేటీఆర్ తో సహా టీఎస్‌పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరామని తెలిపారు.
సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉంది. పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరామన్నారు. జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరు.? అని ప్రశ్నించారు. కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకే తెలియదు.. కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయి? అని ప్రశ్నించారు. పారదర్శక విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారని ఎద్దేవా చేశారు. నిజంగా కేటీఆర్ కు పరువు ఉంటే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలని.. లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలని సవాల్ విసిరారు. కేటీఆర్ పరువు 100కోట్లు అని ఎలా నిర్ణయిస్తారు? అని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దు.. వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారు.. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి అన్నారు.