టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో.. కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలే: రేవంత్‌ రెడ్డి

Revanth reddy comments on cm kcr. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు పార్టీలు కూడా తోడు దొంగలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌,

By అంజి  Published on  14 Nov 2021 2:40 PM IST
టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో.. కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలే: రేవంత్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు పార్టీలు కూడా తోడు దొంగలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌, బీజేపీలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నాయకుల అవతారం ఎత్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదన్నారు. ప్రస్తుతం యాత్రను వాయిదా వేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ధర్నాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని.. తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

నిబంధనలు టీఆర్ఎస్‌, బీజేపీలకు వర్తించవా.. కేవలం కాంగ్రెస్‌కేనా అంటూ నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదన్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రైతుల కోసం ఆయన ధర్నా చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? అంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనని పార్టీలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు. స్పెషల్‌ బడ్జెట్‌ పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వంటే నువ్వంటూ దుమ్మెత్తిపోసుకుంటూ రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో, దళారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువగా వచ్చి.. కొనుగోళ్లు జరగకపోతే ప్రత్యేక పథకం కింద బడ్జెట్‌ పెట్టి.. ఆ బడ్జెట్‌తోనే ధాన్యం కొనుగోళ్లు చేసిందన్నారు. ఓట్ల కోసం అల్లుడి, కొడుకును రోడ్ల మీదకు పంపినా కేసీఆర్.. ధర్నాలో ఎందుకు పాల్గొనలేదన్నారు. తెలంగాణ రైతులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుంటే కేసీఆర్‌ సంతోషంగా తన ఫామ్‌హౌస్‌ విందు వినోదాలు చేసుకుంటారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Next Story