రేవంత్ అరెస్ట్.. 'చలో రాజ్‌భవన్' ఉద్రిక్తం
Revanth Reddy Arrest. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆందోళనలు చేపడుతోంది.
By Medi Samrat
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆందోళనలు చేపడుతోంది. ఈ ఆందోళనల్లో భాగంగా శక్రవారం నాడు 'చలో రాజ్‌భవన్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్కు వద్ద ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ సహా నేతలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ అందుబాటులో లేనందున ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు సూచించారు. అయితే అంబేడ్కర్ విగ్రహం వరకు తమ ర్యాలీని అనుమంతించాలని రేవంత్‌రెడ్డి కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తల సాయంతో రేవంత్ బారికేడ్లను దాటుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం రేవంత్, మధుయాస్కీ సహా ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్టు చేసిన నేతలను అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించడంతో.. తమ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గేట్లు తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం కార్యకర్తలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.