తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాయి
ఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
By Medi Samrat Published on 20 Oct 2023 8:55 AM GMTఇవి దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామన్నారు. అధికారంలోకి రాగానే క్వింటా పసుపుకు రూ.12వేలు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. ప్రేమానుబంధం.. ఈ అనుబంధం ఈనాటిది కాదు.. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. వీరిమధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీకి, బీఆర్ఎస్.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయన్నారు. నేను బీజేపీపై పోరాటం చేస్తుంటే.. నాపై కేసులు పెట్టారు. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు.. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు.. నా ఇల్లు భారత ప్రజలు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందని అన్నారు. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో.. కానీ ప్రజల హృదయాల్లోంచి కాదన్నారు.
కులగణనపై పార్లమెంటులో డిమాండ్ చేశా.. ప్రధాని నా ప్రశ్నకు జవాబు చెప్పలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కులగణనకు ముందుకు రావడంలేదన్నారు. కులగణన అటు మోడీకి.. ఇటు కేసీఆర్ కు ఇష్టంలేదన్నారు. దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్ లది కీలక పాత్ర.. అలాంటి అధికారుల్లో 90శాతం అగ్రవర్ణాలకు చెందినవారే.. అందుకే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారని అన్నారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతామన్నారు. కులగణన ఎక్స్ రే లాంటిది.. కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి.. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్ తో పోరాడుతున్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అన్నారు.