ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చినా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబపాలనతో అవినీతి పెరిగిందన్నారు. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందన్నారు. కొందరు సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారని, అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్థం చూసుకుంటారన్నారు. కుటుంబ వాదంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారన్నారు. కుటుంబ వాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారన్నారు. వారి నియంత్రణను ఎవరు సవాల్ చేయకూడదని కోరుకుంటారన్నారన్నారు. ఇలాంటి వాళ్ల పట్ల తాను కఠినంగా ఉంటానని హెచ్చరించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరుగా ఉండవన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. తాము అభివృద్ధి కోసం పని చేస్తుంటే కొంత మంది స్వలాభం కోసం పనిచేస్తున్నారన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సహకరించడం లేదని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అనేకసార్లు అడిగామని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధిపై కూడా అనేక లేఖలు రాశామని అన్నారు.