హైదరాబాద్: రేపు ప్రజాభవన్‌లో పాలమూరు-రంగారెడ్డిపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు-రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మరో వైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కాగా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి పంచాయతీపై అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. రెండ్రోజుల క్రితం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాగా కీలకమైన ప్రాజెక్టు చర్చల సందర్భంగా అయినా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది.