పార్టీ మార్పు వార్త‌ల‌పై స్పందించిన‌ పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar reacts to the news of party change. పార్టీ మార్పు వార్త‌ల‌ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

By Medi Samrat  Published on  26 July 2023 3:57 PM IST
పార్టీ మార్పు వార్త‌ల‌పై స్పందించిన‌ పొన్నం ప్రభాకర్

పార్టీ మార్పు వార్త‌ల‌ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఎన్ఎస్‌యూఐలో చేరి అక్క‌డి నుంచి 35 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప‌నిచేస్తున్నాని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు చేత ఎన్నో అవమానాలకు, పెప్పర్ స్ప్రే దాడికి గురై చావు అంచుల వరకూ వెళ్ళినా కూడా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడనని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నేతగా నిత్యం తెలంగాణ ప్రజల కోసం.. పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నాన‌ని వివ‌రించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై ఎప్పటిక‌ప్పుడు నిలదీస్తూ ప్రజల తరుపున‌ గొంతుకను వినిపిస్తున్నాన‌ని తెలిపారు.

పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యహరిస్తూ ఏ కమిటీలో చోటు కలిపించ‌క‌పోగా.. పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా.. తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేస్తానని స్ప‌ష్టం చేశారు. ఈనెల 30వ తారీఖు కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొనే సభలో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తగా పాల్గొంటానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.


Next Story