కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. సంచలన లేఖ విడుదల
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2023 9:15 AM GMTకాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ మేరకు ఆయన లేఖలో..
అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలోజరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూస్తున్నది. నాలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్‌మెంట్ కోసం వేచిచూడడంఒక దురదృష్టకర పరిణామం. నేను ఢిల్లీకి వచ్చి 10 రోజులు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలుద్దాం అంటే కనీసం ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు ఢిల్లీకి బీసీ టీమ్ నాయకులు 50 మంది వెళితే ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరం.
తెలంగాణ అంటే ఆత్మ గౌరవానికి ప్రతీక.. ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్ర నాయకుల చుట్టూ బీసీ తిరిగితే పార్టీ పరువు పోతుంది. నేను.. 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి.. తెలంగాణ కోసం నేను మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పనిచేసాను. రాష్ట్రంలో 12 ఏళ్ళు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాను. పార్టీలో అనేక పదవులను అత్యంత నిబద్ధతగా, క్రియాశీలకంగా, పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన నాకే ఇంత అవమానం జరిగితే.. పార్టీలో సగటు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయం అవుతుంది. ఎవరో డబ్బులు ఇచ్చారని.. బీసీ నాయకులు పనికిరారు, వాళ్ళు ఓడిపోయే వాళ్ళు అంటూ టికెట్లు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి, డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెపుతూ పార్టీని అమ్మకానికి పెట్టి ఒక ఒక వ్యాపార వస్తువుగా మార్చి వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్ళు పార్టీని బజార్లో గొడ్లను అమ్మినట్టు పార్టీ టికెట్లను అమ్మకుంటున్నారు.
పార్టీలో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుంది. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న బీసీ కూలలను కూడా గుర్తించి వారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పోరేషన్ పడవులు పార్టీ పదవులు ఇస్తుంటే.. మన దగ్గర పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవులు నిర్వహించిన వారికి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు కూడా కనీసం మాట్లాడేందుకు అగ్ర నాయకులు కలవకపోవడం తెలంగాణ సమాజంలో కాంగ్రేస్ బీసీ నాయకుల పట్ల చాలా చిన్న చూపుగా మారింది.
పార్టీలో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటాం.. ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ ప్రకటనలు ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్ లను గౌరవిస్తాం అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటాం అన్నారు. కొత్తగా వచ్చిన వారు 5 ఏళ్ళు పార్టీలో పని చేస్తేనే పదవులు అన్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు. డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కానీ నేడు పార్టీలో జాయిన్ కాకముందే టికెట్లను అమ్మకుంటున్నారు. ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ.. సర్వేలలో మీ పేరు లేదు అంటూ ఒక అనామకుడు చెప్పింది వింటూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పార్టీలో.. అవమానాలు భరిస్తూ మనుగడ సాదించలేమన్న ఆవేదనతో.. నేను పార్టీతో నాకు ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని అను కుంటున్నాను. ఇంతాకాలం పార్టీలో నాకు పదవులు ఇచ్చిఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ సంచలన లేఖను విడుదల చేశారు.