హైదరాబాద్ లోని టెలిఫోన్ భవన్ దగ్గర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేట్లు మూసివేసిన పోలీసులు సెక్రటేరియట్ గేట్ల దగ్గర భారీకేడ్లు పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు రేవంత్ చెప్పారు. దీంతో అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఎంపీనని.. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అనుమతి లేనిది లోపలికి వెళ్లనివ్వబోమని పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు తన కారును నిలిపివేయడంతో రేవంత్ రెడ్డి డీసీపీతో ఫోన్ లో మాట్లాడారు. తాను ఎంపీని అని, తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను సచివాలయంకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. సచివాలయంలోకి అనుమతి మీ చేతుల్లో లేదని, తాము ప్రజాప్రతినిధులమని గుర్తుంచుకోవాలని చెప్పారు. అలాంటప్పుడు తాము సచివాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. మీరు నన్ను అడ్డుకుంటే రోడ్డు మీదే కూర్చుంటానని చెప్పారు. తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. తాను సచివాలయంలో ఓ అధికారిని కలిసేందుకు వెళ్తున్నానని, అలాంటప్పుడు తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.