ఔటర్ రింగ్ రోడ్‌ను ప్రైవేటుకు అమ్మేశారు.. రూ.1,000 కోట్లు చేతులు మారాయి : రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
TPCC Leader Revanth Reddy Fire On KCR Govt. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిందని
By Medi Samrat Published on 29 April 2023 8:46 AM GMTTPCC Leader Revanth Reddy
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మించింది. ఇందుకోసం 6,696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మించింది. తెలంగాణకు పెట్టుబడులు పెడుతున్నారంటే.. విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ ప్రామాణికం అని రేవంత్ రెడ్డి అన్నారు.
గత 4 సంవత్సరాల నుంచి టోల్ ను ఈగల్ ఇన్ఫ్రా కు కట్టబెట్టారని.. ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుంటుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు కేటీఆర్ కుటుంబం ఆలోచించిందనన్నారు. తమ కుటుంబానికి లాభం ఉండదని.. 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రయివేటుకు తాకట్టు పెట్టారని.. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటుకు అమ్మేశారని ఫైర్ అయ్యారు.
పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి.. కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని అన్నారు. కనీసం 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్.. 7,380 కోట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. దీని వెనక సోమేశ్ కుమార్ వ్యవహారం నడిపారు.. అరవింద్ కుమార్ సంతకం పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం దిగిపోయే ముందు తీసుకున్న నిర్ణయాలను వచ్చే ప్రభుత్వం వెలికితీస్తుందన్నారు. ఇందులో రూ.1,000 కోట్లు చేతులు మారాయి. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని.. మేం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తామని తెలిపారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందని అన్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని.. దీనిపై బీజేపీ నేతలు కూడా స్పందించాలని కోరారు. ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించే పరిస్థితులు లేవని అన్నారు. టెండర్ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని ఆదానీకి కట్టబెట్టాలని చూశారు. ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యత ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్ ను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.