మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కోసం సర్వే పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
పూలేకు సీఎం నివాళులు..
ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా అంబర్‌పేటలో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్‌చార్జి రోహిన్‌రెడ్డి, తదితరులలు పాల్గొన్నారు.