బీజేపీకి కూడా అదే గతి పడుతుంది : మంత్రి హరీశ్‌రావు
People of TS will teach BJP lesson like they taught Congress in 2014. తెలంగాణ ప్రయోజనాలను విస్మరించినందుకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో
By Medi Samrat Published on 31 March 2023 6:35 PM IST
తెలంగాణ ప్రయోజనాలను విస్మరించినందుకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో భారతీయ జనతా పార్టీకి కూడా అదే గతి పడుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని శివ్వంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని.. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించి కాంగ్రెస్‌ను మట్టికరిపించారని గుర్తుచేశారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కూడా విస్మరిస్తోందని అన్నారు. రాష్ట్రం కోరిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వైద్య కళాశాలలు, నవోదయ పాఠశాలలు, నర్సింగ్ కళాశాలలు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) కు జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధుల విడుదలను అడ్డుకోవడం, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రజల ఆగ్రహానికి గురికానుందని మంత్రి అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తెలంగాణకు నిధులు, విద్యాసంస్థలను ఏ విధంగా నిరాకరిస్తున్నదో వివరించడంతో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గ్రామాల్లో ప్రతి గడపకు తీసుకెళ్లాలని మంత్రి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేకల హేమలతగౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.