హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వీణవంక మండల పరిధిలోని రెండు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. పలుచోట్ల టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘన్ముక్లలో పోలింగ్ కేంద్రం వద్దకు టీఆర్‌ఎస్ తరఫున ఎలక్షన్ పర్యవేక్షణకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని చూసిన గ్రామస్తులు.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినదించారు. దీంతో ఘన్ముక్ల గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తాను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నానని అన్నారు. తనకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉందని, తనను బీజేపీ వాళ్లు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఓడిపోతామన్న బాధతో ఇలా ప్రవర్తిస్తున్నారని, బీజేపీ నాయకులకు ప్రజలు కచ్చితంగా ఓటుతో బుద్ది చెబుతారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నా.. తనకు రాజ్యాంగం ప్రకారం 305 పోలింగ్ బూతులకు వెళ్లే హక్కు ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. తన వెను టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ లేరని, అయినా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీణవంక మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు మినహా ఇతర పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు.