జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని అచ్చంపేట మండలం అక్కారం గ్రామానికి చెందిన అమర్‌సింగ్ అనే విద్యార్థిగా గుర్తించారు. అమర్ సింగ్ ఉన్నత చదువులు చదివేందుకు జర్మనీకి వెళ్లి మార్చి 13న ప్రమాదానికి గురయ్యాడు. అయితే.. అక్కారంలోని అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు బుధవారం కుమారుడు మృతి చెందిన విషయం తెలిసింది. అమర్ సింగ్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడనే వార్త విని.. ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.
కుమారుడి భవిష్యత్ కోసం జర్మనీకి పంపిస్తే.. మృత్యువు కబళించిందని అమర్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమర్‌సింగ్ మృతదేహాన్ని తెలంగాణకు తీసుకొచ్చేందుకు సహకరించాలని అమర్ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు కేటీఆర్ సంబంధిత అధికారులతో మాట్లాడి అమర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే.. అమర్ తల్లిదండ్రులను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు.