తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినా.. టికెట్ పై హామీ దక్కకపోగా.. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టికెట్‌ను కేటాయించింది.
దీంతో ఆగ్రహానికి గురైన నాగం జనార్ధన్ రెడ్డి.. తన అనుచరులతో సమావేశమై ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం సాయంత్రం మంత్రి హరీశ్ రావు సమక్షంలో నాగం బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తుంది.