హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరిగిన రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కొనసాగుతున్న ఆంక్షలు తొలగిపోవడంతో ప్రభుత్వం ఇక పూర్తిస్థాయి పాలనపై దృష్టి సారించనుంది.
రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగ్గా.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని విధించిన ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా ముగియడంతో నేటితో రద్దయ్యింది. ప్రకటించిన కాలక్రమం ప్రకారం ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున, మోడల్ ప్రవర్తనా నియమావళి కింద విధించిన ఆంక్షలు ఇకపై అమలులో లేవు.