మోదీ 3.0: టార్గెట్ తెలంగాణ.. ఈసారి డబుల్ చేయడమే టార్గెట్

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 March 2024 9:47 AM IST
PM Modi, BJP, Lok Sabha seats, Telangana, BRS

మోదీ 3.0: టార్గెట్ తెలంగాణ.. ఈసారి డబుల్ చేయడమే టార్గెట్

హైదరాబాద్: కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది. తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ 2014లో ఒక సీటు, 2019లో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈసారి అంతకు మించి సాధించాలనేదే బీజేపీ టార్గెట్. ముఖ్యంగా డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ క్షీణించడం.. తమకు ప్లస్ పాయింట్ గా మారబోతోందని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా, ప్రధాన ప్రతిపక్షంగా మారడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా కాషాయ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ఈసారి రెండంకెల సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని లాభపడ్డాలని బీజేపీ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉన్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొద్దిరోజులుగా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటకతో పాటు దక్షిణాదిన అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని బీజీపీ భావిస్తోంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించి ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనంతరం మార్చి 12న హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌ షా.. పోలింగ్‌ బూత్‌ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తో సంభాషించారు. తెలంగాణలో మరోసారి కూడా ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

మార్చి 15న మల్కాజిగిరి, మార్చి 16న నాగర్‌కర్నూల్‌, మార్చి 18న జగిత్యాలలో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. జి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), మాధవి లత (హైదరాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భోంగీర్) మార్చి 15న మల్కాజిగిరిలో జరిగే రోడ్‌షోలో మోదీతో కలిసి రానున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రాబల్యం బాగా తగ్గిపోతూ ఉందని.. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య పోరు సాగుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్‌ ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. “మేము 12 నుండి 15 సీట్లలో మంచి స్థానంలో ఉన్నాము. అత్యధిక సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని ఫలితాలు రుజువు చేస్తాయి.”అని ప్రభాకర్ అన్నారు.

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి బీజేపీ రెండంకెల సీట్లు సాధిస్తుందన్నారు. మోదీ 3.0 వేవ్ కారణంగా తెలంగాణలో బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు ఖాయమని ఆయన అన్నారు. అమిత్ షా, మోదీతో పాటు వివిధ కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో ప్రచారం చేస్తారని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మరోసారి మోదీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

"2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లను సాధించింది. ఈసారి కూడా అదే ధోరణి కనిపిస్తే, పార్టీ సీట్ల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది, ”అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఖమ్మం వంటి కొన్ని సెగ్మెంట్లు మినహా చాలా వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఉంటుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

Next Story