తెలంగాణలో వార్ వన్ సైడ్ : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని

By Medi Samrat  Published on  22 Oct 2023 2:32 PM GMT
తెలంగాణలో వార్ వన్ సైడ్ : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడతారని తేల్చిచెప్పారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లిన కవిత అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత పది ఏళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.తమ ప్రభుత్వం చేసిన చేసిన మంచి పనులే తమను గేలిపిస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ ను మరొకసారి ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉంటుందని విమర్శించారు. 65 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చేయనన్ని పనులను గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి తమ పార్టీ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందని చెప్పారు.

తమ పథకాలను కాపీ కొట్టి 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, మరి ఈ ఆరు గ్యారెంటీల అమలకు ఏ నాయకుడు గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యారంటీల హామీలు ఇస్తోందని విమర్శించారు.

తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందనీ, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ అక్కడ తెలంగాణ వాసులు గంగా జమున తహజీబ్ లా కలిసిపోయారని హర్షం వ్యక్తం చేశారు.

Next Story