రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు : కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు.

By Medi Samrat  Published on  5 March 2024 1:52 PM GMT
రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు : కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత వాసనతో మోదీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని.. బడే భాయ్ అని, తాను చోటే భాయ్ నని అన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అనడం హాస్యాస్పదం గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని అన్నారు. ప్రధానమంత్రి మోదీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రధాని మోదీ తెలంగాణకు తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు.

భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏకనాథ్ షిండేలా మారబోతున్నారా అని కూడా ప్రశ్నించింది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నికవుతారని తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ అనుముల విశ్వసిస్తున్నారని, ‘గుజరాత్ మోడల్’ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు నిరంతర మద్దతు కావాలని ఆయన కోరారని బీఆర్ఎస్ తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై మీ స్వంత పార్టీ ముఖ్యమంత్రికి నమ్మకం లేనట్లు ఉందని భారత రాష్ట్ర సమితి రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Next Story