రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండు-మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. నిజామాబాద్‌లో పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరిలోనే ఎలక్షన్ ప్రక్రియ ముగియనుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను కేవలం రెండు డివిజన్లు మాత్రమే కాంగ్రెస్ గెలుపొందిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పేర్కొన్నారు.