ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By - Knakam Karthik |
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
హైదరాబాద్: టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను ను రద్దు చేసి, ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని మంత్రి సూచించారు. తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలలోని ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీలకు సంబంధించిన జోన్లను ఇప్పటికే రద్దు వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించినట్లు గుర్తుచేశారు. ఒకవేళ నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామన్నారు. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడమే ప్రభుత్వం ఉద్దేశ్యం అని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామని అన్నారు.
ఆయిల్ పామ్ ప్లాంటేషన్ త్వరితగతిన విస్తరణ కోసం అవసరమైన చోట అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను చేర్చుకోవాలని ఆయిల్ ఫెడ్ ఎండికి సూచించారు. అయిల్ పామ్ సాగుకు అవసరమైన పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగం చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గారికి సూచించారు. దీంతో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సాగు ఖర్చు ఆదా అవుతుందని అన్నారు. రైతులు సాగు కోసం చేసే ఖర్చును తగ్గించడానికి అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అనంతరం వచ్చే వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తులను తయారుచేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కల్లూరుగూడం మరియు బీచుపల్లిలోని ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగులో దిగుబడి పెంచడం కోసం ఆయిల్ పామ్ రైతులకు ట్రైకోడర్మా, గానోడెర్మా నిరోధక బయో ఫర్టిలైజర్లు అయిన VAM, మెగ్నీషియం, సల్ఫర్ మొదలైన వాటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర సేవల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను పామ్ ఆయిల్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయిల్ ఫెడ్ ఎండికి సూచించారు.
ఆయిల్ పామ్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పామ్ ఆయిల్ పై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకం 16.5 శాతం నుండి గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహన్ మరియు పియూష్ గోయల్ గారితో పాటు ప్రధాన మంత్రి మోడీ గారికి కూడా లేఖ రాసినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి అమ్మాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రొక్యూర్ మెంట్, సీడ్ వెరైటీలు, స్టోరేజీల నిర్వహణలకు సంబంధించి ఇంకా పాత పద్ధతులనే అవలంభిస్తున్నామని, పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ లాంటి సంస్థల ద్వారా కేవలం మన రాష్ట్రంలోనే ఇంత పెద్దమొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రైతులకు నష్టం రావొద్దనే ఉద్దేశ్యంతేనే చేస్తున్నప్పటికి, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రణాళికలు తయారుచేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములలో ఎక్కువ కాలం స్టోరేజీ చేయకుండా, పంట పాడవకముందే మంచి రేటు రాగానే అమ్ముకోవాలని అన్నారు.