కేటీఆర్‌కు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ అని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పథకాలను ఒక్క గ్రామానికే పరిమితం చేసినట్లుగా భ్రమ పడుతున్నారని అన్నారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. చింతమడక సీఎంలం కాదు అని, ఇది ప్రజా ప్రభుత్వం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు.
నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంటే కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలో నూతన పథకాలను విజయవంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలు పెట్టి, ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరి ఎన్నికల లబ్ధి కోసం తాము పథకాలు అమలు చేయడంలేదన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
గత సీఎం కేవలం చింతమడకకే సీఎం అయినట్లు వ్యవహరించి.. ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు పంచిపెట్టి పెట్టారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. గత పది సంవత్సరాలలో పేదల గృహ నిర్మాణాన్ని విస్మరించి, కొత్త రేషన్ కార్డులను ఇవ్వని మీరు.. ఇప్పుడు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.