మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క
ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 8:30 PM IST![మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క మాకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క](https://telugu.newsmeter.in/h-upload/2025/02/06/394164-minister-seethakka-fire-on-brs.webp)
ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం.. కొన్ని యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.. అబద్ధాలు ఎంతో కాలం నిలవవు అన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు అక్కస్సు వెళ్లగక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో సమస్యలకు బీఆర్ఎస్సే కారణం అన్నారు. పదేళ్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేశాయని.. బీఆర్ఎస్‌నే రాష్ట్రానికి అతిపెద్ద సమస్య అన్నారు.
తప్పుడు లెక్కలు చెప్పటంలో బీఆర్ఎస్ దిట్ట అని విమర్శించారు. 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పి.. తెలంగాణ వచ్చిన తర్వాత 400 మందికి కుదించారన్నారు. అధికారులు శాస్త్రీయంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారన్నారు. ప్రజల్లో మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.. అణగారిన వర్గాల దశాబ్దాల సమస్యకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ స్పాన్సర్ లీడర్స్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారన్నారు.
అబద్దానికి పుట్టిందే బీఆర్ఎస్.. అబద్దానికి అంబాసిడర్ బీఆర్ఎస్.. ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతుంటే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్‌కు కుల గణన చేపట్టటం చేత కాలేదు.. ఎస్సీ వర్గీకరణ చేయలేదన్నారు. లిమ్కా బుక్ రికార్డు కోసం ఒకరోజు సర్వే హడావుడి చేశారు.. ఆ సర్వే నివేది లో నిజం లేదు కాబట్టే అసెంబ్లీలో పెట్టలేదు.. చట్టబద్ధత కల్పించలేదన్నారు. ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా చేసిన సర్వేపై ఇప్పుడు కూని రాగాలు తీస్తున్నారన్నారు.
సర్వేలో ఎక్కడా లోపం లేదు.. బీసీ జనాభా 56.33% గా వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన నచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఇంకా మాకు నాలుగు సంవత్సరాలు సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. మీకు 10 ఏళ్లు అధికారం అప్పజెప్పినా.. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. పారదర్శకంగా గ్రామ సభలలోనే అర్హులని ఎంపిక చేస్తున్నామన్నారు.