వాళ్ల‌కు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క

నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు.

By Medi Samrat  Published on  22 Jan 2025 5:00 PM IST
వాళ్ల‌కు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క

నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. బుధ‌వారం ఆమె మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్‌ పత్రికలోనే చెప్పారు.. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు.. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుందన్నారు.

పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు.. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామ‌ని తెలిపారు. గతంలో ఎంఎల్ఏ లు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవన్నారు. ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌ల‌లో, ఇళ్ల‌ల్లో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారు.. కానీ మా ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని విమ‌ర్శించారు.

బీఆర్ఎస్‌ హయాంలో ఓట్లప్పుడే పథకాలు అరకొరగా ఇచ్చేవారని.. కానీ మా ప్ర‌భుత్వంలో ప్రజా అవసరాలు, ఆర్థిక వనరులను బట్టి పథకాలను అమలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు.. అందుకే ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ గొడవలు చేస్తుంద‌ని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటింటి సర్వేలో పాల్గొనలేదు.. ఇప్పుడు వాళ్ల‌కు పథకాలు రావనే ఆందోళన ఉందన్నారు.

ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని.. గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామ‌ని.. బీఆర్ఎస్ చేత కాని త‌నం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు.? అని ప్ర‌శ్నించారు.

వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు ఇచ్చారు.. కాని.. రెక్కల కష్టాన్ని నమ్ముకున్నా కూలీలకు ఎలాంటి సహాయం చేయలేదు.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని భ‌రోసా ఇచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదు.. బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకేసారి అమాంతం పైకి రాలేదు.. బీఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా.? అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి, ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి.. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందన్నారు. మంచిని తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం బీఆర్ఎస్ కు అలవాటు అని విమ‌ర్శించారు.

Next Story