'అప్పుల అప్పారావులా అప్పులు చేసి'.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు
By Medi Samrat Published on 16 Oct 2024 3:14 PM ISTరేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు. 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు అయ్యాయని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. ఈ మేరకు సీతక్క.. తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరు.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందన్నారు
అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలి. అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించలేదు. చేసిన పనులకూ బిల్లులు చెల్లించలేదు. 5 వేల కోట్ల ఫీ రియంబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్దలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్..ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పుడు బుకాయిస్తే ఏలా? అని ప్రశ్నించారు.
మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ఈ పది నెలల కాలంలో 18 వేల కోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫీ చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేసింది ప్రజా ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు..ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని.. అయినా మీరు అప్పులు, బకాయిలు, హమీల గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని కౌంటరిచ్చారు.