బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో జరిగిన అక్రమాలన్నిటినీ బయటపెడతాం..అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి తెచ్చినప్పుడు చాలా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రేపు సాయంత్రం 5 గంటలకు భూ భారతి ప్రారంభం అవుతుంది. అందరూ ఒకేసారి లాగిన్ అయితే ఇబ్బంది వస్తుంది. కావాలని టెక్నికల్‌గా సమస్య సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం. భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం. అర్ధరాత్రి హడావిడిగా చేసిన గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడానికే ఈ భూ భారతి. ప్రజల భూమిని భద్రంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిది...అని మంత్రి పొంగులేటి తెలిపారు.
గత ప్రభుత్వం ధరణి చట్టంలో సాదా బైనామా భూముల సమస్య పరిష్కారం కాలేదు. సామాన్యుడికి సులువుగా అర్థమయ్యేలా భూ భారతి పోర్టల్ ఉంటుంది. ధరణి సమయంలో కలెక్టర్లకు మాత్రమే సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లోని రెవెన్యూ అధికారి రిపోర్టు రాయగలగాలి. త్వరలోనే 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం చేస్తాం. 90 రోజుల ట్రైయినింగ్ ఇచ్చి లైసెన్స్ ఇస్తాం. పోడు భూములను తరాలుగా సాగు చేసుకునే వారికి భద్రత కల్పించే ఆలోచన చేస్తున్నాం. మాకు భూ భారతి చట్టంపై ఎంతో నమ్మకం ఉంది. ఇదే వచ్చే ఎన్నికల్లో మా రెఫరెండం...అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.