ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్..!
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
By - Medi Samrat |
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అలాగే.. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు లేని.. అర్హులైన పేదవారికి 72 గజాల చొప్పున కేటాయించే మహత్తరమైన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌తో కలిసి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని విధాలా మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తప్పుకుండా గెలిపించాలని కోరారు. ప్రజల సుభిక్షం కోసం ఇప్పటికే నిరుపేదలకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, విద్యార్థులకు కాస్మొటిక్ మెస్ ఛార్జిలు పెంపు, ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు, రాష్ట్రంలో సుమారు 26 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత పాలకులు పదేళ్లు అధికారంలో ఉన్నా రుణమాఫీ చేయకుండా రైతన్నలను అరిగోస పెట్టారన్నారు. డబుల్ బెడ్రూంలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు.