15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తాం.. మే 5 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat
9 నెలలు మేదోమదనం చేసి భూ భారతి చట్టం రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ చట్టాన్ని అందరి సలహాలు, సూచనలు తీస్కుని తయారు చేసామని.. అసెంబ్లీలో భూ భారతి చట్టాన్ని బీఆర్ఎస్ అడ్డుకునే యత్నం చేసింది.. పేదల కోసమే కాంగ్రెస్ భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం లింగంపేట మండలం షెట్ పల్లి గ్రామంలో భూ భారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ స్పూర్తితో రోల్ మోడల్ గా ఉండేలా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు.
కేసీఆర్ చేప్పిందే చట్టంలా ధరణి తెచ్చి పేదల భూములు లాక్కున్నారు. ఇకపై రెవిన్యూ యంత్రాంగమే భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. 15 రోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తాం.. త్వరలో 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ లు ఇస్తాం.. త్వరలో పాసు బుక్కుల్లో మ్యాప్ లు ఇస్తామని తెలిపారు. అటవీ భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. పైలెట్ మండలాలుగా ఉన్న 4 మండలాల్లో భూ భారతి ద్వారా సమస్యలను జూన్ 2 వరకు పరిష్కరిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆగస్టు వరకు రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేసీఆర్ చేయని పనులన్నీ తాము చెపడుతున్నామని కేసీఆర్ ఏడవటం విడ్డూరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు.
మే 5 లోపు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని.. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా.. తాము సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇందిరమ్మ రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు.