నల్లబంగారంతో పాటు తెల్లబంగారం మన దగ్గరే ఉంది: మంత్రి కేటీఆర్
తెలంగాణలో పండే పత్తి ఎంతో నాణ్యమైనదని చెప్పారు మంత్రి కేటీఆర్. నల్లబంగారంతో పాటు తెల్లబంగారం కూడా మన దగ్గరే..
By Srikanth Gundamalla Published on 17 Jun 2023 8:20 AM GMTనల్లబంగారంతో పాటు తెల్లబంగారం మన దగ్గరే ఉంది: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో యంగ్‌వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్‌లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తోన్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేశాక కంపెనీ ప్రతినిధులు, పార్క్‌లో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తోన్న ఇతర ప్రతినిధులను కలిసి మాట్లాడారు మంత్రి కేటీఆర్. అనంతరం మరిన్ని కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
యంగ్‌వన్ కంపెనీ టెక్స్‌టైల్ పార్కులో రూ.840 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. టీఎస్‌ఐఐసీ టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించారు.. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణలో పండే పత్తి ఎంతో నాణ్యమైనదని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నల్లబంగారంతో పాటు తెల్లబంగారం కూడా మన దగ్గరే ఉందని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ అని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని చెప్పారు. యంగ్‌వన్ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం, ఆ తర్వాత టెక్స్‌టైల్ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్‌లో నెంబర్ వన్ పత్తి పండుతోందని.. అంతర్జాతీయ స్థాయిలో ఈ టెక్స్‌టైల్ పార్క్ ఉండబోతుందన్నారు. అయితే.. వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. వరంగల్ జిల్లాలో వచ్చే మూడు కంపెనీల వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్.
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కష్టపడి పని చేసిన ప్రభుత్వం వైపు ప్రజలు నిలబడాలని కోరారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌కు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని.. హ్యాట్రిక్ కచ్చితంగా కొడతామని దీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.