సిరిసిల్ల జిల్లా కలక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని అన్నారు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు.
స్వరాష్ట్రo ఏర్పడ్డ ఎనిమిదేండ్లలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, సఫల రాష్ట్రంగా తీరిదిద్దామని కేటీఆర్ తెలిపారు. నాటికి నేటికీ తెలంగాణలో వచ్చిన మార్పులకు దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఎన్నో అనితరమైన పనులను సుసాధ్యం చేశామని అన్నారు. 1947 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్ విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించినట్టు చెప్పారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని కేటీఆర్ తెలిపారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు.