తెలంగాణ 10వ తరగతి పరీక్షల సమయంలో లీకేజీ వ్యవహారం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అయోమయంలోకి నెట్టేసింది. పరీక్ష మొదలైన కొన్ని నిముషాలకే ప్రశ్నా పత్రాలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చేవి. అనూహ్య పరిణామాల అనంతరం.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్టు చేశారు. లీకేజీ ఆయనే చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రశ్నిస్తున్నందుకే అరెస్టు చేశారని.. బీజేపీ ఆరోపించింది. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత బండి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు.
తాజాగా పేపర్ లీక్ లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలకవ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బండి సంజయ్ కొందరు చిల్లరగాళ్లతో కలిసి పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేయాలని చూశాడని.. బండి సంజయ్ ని జైల్లో వేయగానే పేపర్ లీక్ లు ఆగాయని అన్నారు. బండి సంజయ్ లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళంలోకి నెట్టాడని ఆరోపించారు. బండి సంజయ్ బెయిల్ పై బయటకొస్తే సన్మానాలు చేసుకున్నారని కేటీఆర్ విమర్శించారు.