మోదీజీ.. ఆ మూడు ప్రధాన హామీల సంగతేంటి: మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మూడు ప్రధాన హామీల సంగతేంటి? అని ప్రశ్నించారు.

By అంజి  Published on  3 Oct 2023 6:15 AM GMT
Minister KTR, PM Modi, Telangana, BRS, BJP

మోదీజీ.. ఆ మూడు ప్రధాన హామీల సంగతేంటి: మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌ పర్యటన వేళ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మూడు ప్రధాన హామీల సంగతేంటి? అని ప్రశ్నించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టు జాతీయహోదా దక్కేదెప్పుడు అంటూ ప్రధానికి కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న మోదీజీ.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? అని నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర అని ఎక్స్‌ వేదికగా అడిగారు.

మోదీజీ మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా? అని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని, లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారని మండిపడ్డారు. తమప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారని ప్రధాని మోదీపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రధాని తన 10 ఏళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులని మోసం చేశారని అన్నారు.

''2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..?'' అంటూ ప్రధాని మోదీని కేటీఆర్‌ ప్రశ్నించారు. పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్‌ మాదిరిగానే ఉందన్నారు. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో చెప్పాలన్నారు. మోదీ జీ.. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో.. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటన్నారు. తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని కేటీఆర్‌ అన్నారు. మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని జోష్యం చెప్పారు.

Next Story