గోల్కొండ హోటల్‌లో ఈటల, రేవంత్ రహస్య భేటీ : మంత్రి కేటీఆర్
Minister KTR allegations on Etela Rajender.హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల
By తోట వంశీ కుమార్ Published on 23 Oct 2021 12:33 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రహస్యంగా కలిశాడని.. వారిద్దరూ గోల్కొండ హోటల్‌లో కలిసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. హైటెక్స్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల పోటి చేస్తున్నారని విమర్శించారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పోటీలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఎన్ని లోపాయికారీ ఒప్పందాలు చేసినా.. కుట్రలు చేసినా.. విజ్ఞులైన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.
ఇక ప్లీనరీ ఉదయం 10గంటలకే ప్రారంభం అవుతుందన్నారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధితులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనుమతి ఉన్నవారే సమావేశానికి హాజరవుతారని స్పష్టం చేశారు. సమావేశానికి 6వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారన్నారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సభా ప్రాంగణానికి ఇరువైపులా 50 ఎకరాల్లో పార్కింగ్ ఉంటుందని తెలిపారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని.. ఏడు అంశాలపై తీర్మానాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.