మేము వద్దనుకున్న వాళ్ళను తీసుకొని మీరు ఏమీ చేయలేరు : హరీష్ రావు

Minister Harish Rao Comments On Congress. మీరు పొడు పట్టాలు అడిగారు.. సీఎం కేసీఆర్ మీకు రైతు బంధు కూడా ఇవ్వమని చెప్పారని.. పోడు భూముల ప‌ట్టాల

By Medi Samrat  Published on  30 Jun 2023 5:29 PM IST
మేము వద్దనుకున్న వాళ్ళను తీసుకొని మీరు ఏమీ చేయలేరు : హరీష్ రావు

మీరు పొడు పట్టాలు అడిగారు.. సీఎం కేసీఆర్ మీకు రైతు బంధు కూడా ఇవ్వమని చెప్పారని.. పోడు భూముల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొడు పట్టాలు మధ్యలో ఆగిపోతాయి అని అంటున్నారు.. మధ్యలో ఆపింది మీరు.. మీరు ఇచ్చి ఉంటే మాకు ఇచ్చే అవకాశం ఉండేది కాదని అన్నారు. మీరు ఇచ్చింది 3 లక్షల ఎకరాల్లో, మేము 13 లక్షల ఎకరాల్లో ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్టించుకున్నది లేదని అన్నారు. తండాలను గ్రామ పంచాయితీలు చేస్తామని మోసం చేశారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేసింద‌న్నారు.

రేపు రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటనకు వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల‌లో.. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఎందుకు అమలు కావడం లేదని ప్ర‌శ్నించారు. రూ.72 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్‌గా రైతుల అకౌంట్ లో వేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్ల‌డించారు. పక్క రాష్ట్రాలు మాకు బియ్యం ఎగుమతి చేయండి అని అడిగారు అంటే.. అదే సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమ‌న్నారు.

మేము వద్దు అనుకున్న వాళ్ళను.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మేము వద్దనుకున్న వాళ్ళను మీరు తీసుకొని ఏమి చేయలేరని ఎద్దేవా చేశారు. మా పార్టీలో శకునులు పోయారు.. ఈ సారి జిల్లాలో సీన్ రివర్స్ అవుతుంది.. వాళ్ళు ఒక్కటి గెలిచి.. మేము 9 గెలుస్తామ‌న్నారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకొని వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ కు 56 సెంటీమీటర్ల ఛాతి లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏం కావాలో అనే సంపూర్ణమైన అవగాహన ఉంద‌న్నారు. ఇంతగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ విభజన చట్టంలోని హామీలను.. ఏ ఒక్క రోజైనా పార్లమెంటులో అడిగారా.. ప్రశ్నించారా అని నిల‌దీశారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగల పార్టీల‌ వల్ల రాష్ట్రం నష్టపోయిందన్నారు. కొందరు డబ్బులు ఉన్నాయని విర్రవీగుతున్నారని.. వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని హ‌రీష్ రావు అన్నారు.


Next Story