Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ

ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.

By Knakam Karthik
Published on : 27 April 2025 3:03 PM IST

Telangana News, Mulugu District, Karrerugutta, Operation Kagar, Maoist Tunnel, Chhattisgarh, Telangana, Maharashtra, Naxalites

Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే 'ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. గత ఆరు రోజులుగా విస్తృతంగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఈ రహస్య స్థావరం వెలుగు చూసింది. దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఒకేసారి తలదాచుకునేందుకు వీలుగా ఈ సొరంగం నిర్మించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు భావిస్తున్న ఈ సొరంగం లోపల విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు, మైదానం వంటి ప్రదేశాలతో పాటు కీలకమైన నీటి సదుపాయం కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఆధారాలను బట్టి మావోయిస్టులు కొద్ది కాలంగా ఇక్కడే మకాం వేసి కార్యకలాపాలు సాగించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మూడు రాష్ట్రాల (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర) సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్ట ప్రాంతం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు కీలకమైనది. అయితే, భద్రతా బలగాల రాకను ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు ఈ సొరంగాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా సహా పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలోనే ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి.

ప్రతికూల వాతావరణం, ఎండ తీవ్రత, భారీ వర్షం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. మరోవైపు, ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేసి, చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కర్రెగుట్ట ప్రాంతం భద్రతా బలగాల ఆధీనంలోకి వస్తుండగా, ఆపరేషన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

Next Story