కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిది? : భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka Questions KCR. దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే విపక్ష అభ్యర్థుల ఎన్నికలకు అయ్యే ఖర్చు తానే పెడతానని

By Medi Samrat  Published on  12 April 2023 5:28 PM IST
కేసీఆర్‌కు అంత డబ్బు ఎక్కడిది? : భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka Questions KCR


దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే విపక్ష అభ్యర్థుల ఎన్నికలకు అయ్యే ఖర్చు తానే పెడతానని చెప్పిన కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం తనకు ఇల్లు తప్ప మరే ఆస్తులు లేవని చెప్పిన కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికలకు ఖర్చు చేసేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ వనరులు, సంపదను దోపిడీ చేసి పోగేసిన డబ్బును ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడని అన్నారు. తాను పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, తెలంగాణలో మిషన్ భగీరథ స్కీం అతిపెద్ద స్కామ్ గా మారిందని ఆరోపించారు. మిషన్ భగీరథ కోసం వెచ్చించిన 42 వేల కోట్లు దోపిడి పాలయ్యాయని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటుపై చిత్తశుద్ధి లేని కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనడానికి రాష్ట్రం నుంచి అధికారులను అక్కడికి పంపించడం విడ్డూరంగా ఉందన్నారు.

గాంధీ కుటుంబం కావాలా? దోపిడి చేసే పాలకులు కావాలా?

తాతా, నానమ్మ, తండ్రి ప్రధానులైన సొంత ఇల్లు లేనటువంటి నిజాయితీకి నిలువుటద్దం లాంటి రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి కావాలా? దేశ సంపదను దోపిడీ చేస్తున్న మోడీ, కేసీఆర్ లాంటి వాళ్లు కావాలా? ప్రజలే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సొంత ఆస్తులను దేశానికి అంకితం చేసిన గాంధీ కుటుంబమే ఈ దేశానికి మార్గదర్శకమన్నారు. దేశ సంపదను క్రోని క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్న ప్రధానిని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గారి మీద అన్యాయం గా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 14న భారత రాజ్యాంగం అందించిన అంబేద్కర్ పుట్టిన రోజున జై భారత్ సత్యాగ్రహ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు లక్ష మందితో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున్ ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, పాల్గొంటారని వెల్లడించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు పిసిసి కార్యవర్గ సభ్యులు ఈ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఎటువంటి జై భారత్ సత్యాగ్రహ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామిక వాదులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.



Next Story