హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కారణంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేసిన ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఓ ఫ్లెక్సీ కారణంగా వివాదం చెలరేగింది. జూబ్లీహిల్స్‌లోని వెంగళరావునగర్‌లో కొంతమంది మహిళలు రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. స్థానిక మహిళలు రెచ్చిపోయి కారులో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావు పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.
ఓ మహిళ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ.. కార్పొరేటర్ పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో కార్పొరేటర్ దేదీప్య రావుకు స్వల్ప గాయాల య్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు, ఆమె భర్త విజయ్ ముదిరాజ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. కాంగ్రెస్ నాయకుల అండతోనే బీఆర్‌ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై మహిళలు దాడి చేశారని ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఆరోపిస్తున్నారు. దేదీప్య రావు పై మహిళలు దాడి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.