గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్

గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే

By Medi Samrat  Published on  18 Oct 2024 11:47 AM GMT
గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్

గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ జరిపి.. న్యాయ సమీక్ష అవసరం లేదు.. అంతా సక్రమంగానే ఉందని.. ఈనెల 21వ తేదీన యధావిధిగా గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ కొనసాగించండి అంటూ తీర్పును వెల్లడించింది. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌ చేపట్టారు. అనంతరం మంత్రులతో చర్చలు జరిపారు. అనంతరం పిటిషనర్లు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును హై కోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్ -1 పై దాఖలైన అప్పీల్ పిటిషన్ లను హై కోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది.‌ ఈ నెల 21 నుండి గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని తీర్పు వెల్లడించింది.

ఇదిలావుంటే.. శుక్ర‌వారం మధ్యాహ్నం సమయంలో ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి.. గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఫేస్ మాస్కులు ధరించి అభ్యర్థులు ఒక్కసారిగా అశోక్ నగర్ లోని రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అక్కడినుండి చెదరగొట్టారు.

ఇదిలావుంటే.. గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందే అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణం.. న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు.. జీవో 29 గొడ్డలిపెట్టు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

Next Story