రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం వ్యతిరేకంగా ట్వీట్లు చేసుకుంటున్నారు. ఈ వివాదానికి ఆజ్యం పోస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. పక్షపాతం ఉన్న వ్యక్తి (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ..) సమానత్వ విగ్రహాన్ని ఆవిష్కరించారని కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనమని, సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. ట్వీట్‌ను ట్యాగ్ చేసి 'బర్నాల్ మూమెంట్' అని రాస్తూ రిప్లై ఇచ్చారు. అంతకుముందు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. అప్పటి నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. 'సమతమూర్తి' విగ్రహావిష్కరణ కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చారు.