కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు..కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఫైర్

తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 5:05 PM IST
Telangana politics, cm revanth, congress, ktr, brs, bjp

కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు..కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఫైర్

తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అబద్దాలు చెప్పి కాలం గడుపుతున్న రేవంత్ రెడ్డి, వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను 400 రోజులైనా నెరవేరలేదని, ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదన్న ఆయన, అందుకే రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి ఇస్తామన్న రైతు భరోసా ఊసే లేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోన్న రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనించాలని కోరుతున్నట్లు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందన్న ఆయన, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లారని అన్నారు. రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే అక్రమ కేసు బనాయించి ఇబ్బంది పెట్టినా, విచారణ సంస్థలకు కేటీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారని మాట్లాడారు. హైదరాబాద్ ప్రతిష్ట కోసం ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారని, ఈ కార్ రేస్‌లో ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉందన్న ఆయన, ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పారు. రెండోసారి ఈ కార్ రేస్ జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందని, ఒక వేళ కేసు పెట్టాల్సి వస్తే సీఎం రేవంత్‌పైనే కేసు పెట్టాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీఎం రేవంత్‌రెడ్డిని విచారణ చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకే రకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కేటీఆర్ భయపడే రకం కాదని, తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Next Story