హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన క్లీన్ చిట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదని, పార్టీ ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించే చర్య అని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ పరిణామాలను ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.