గాంధీలకు వేల కోట్లు ఇచ్చేందుకు పైసలుంటాయి కానీ, రైతులకు ఉండవా?: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By - Knakam Karthik |
గాంధీలకు వేల కోట్లు ఇచ్చేందుకు పైసలుంటాయి కానీ, రైతులకు ఉండవా?: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పూర్తిగా గాలికొదిలేసిందని, కేవలం దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, కేవలం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి సమర్పించుకుంటున్న వేల కోట్ల రూపాయల గురించే చర్చ జరుగుతోందని ఆరోపించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే ఢిల్లీకి చేరవేసేందుకు సీఎం వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే, ఆయన రాష్ట్ర ప్రజల సొత్తును ఇంకెన్ని వేల కోట్లు మింగి ఉండాలో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా అగాధంలోకి నెట్టిందని, గతంలో కేసీఆర్ హయాంలో డిసెంబర్‌లోనే రైతుల ఖాతాల్లో చేరాల్సిన రైతుబంధు నిధులు, మార్చి వచ్చినా ఇప్పటికీ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతులకు రైతుబంధు ఇచ్చే తెలివి, రుణమాఫీ చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేవని మండిపడ్డారు. కనీసం రైతులు పండించిన జొన్నలు, పత్తి పంటలను కొనుగోలు చేసే పరిజ్ఞానం కూడా లేకపోవడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తాననడంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “ఆ వెయ్యి కోట్లు నీ అయ్యా సొమ్మా? లేక నీ అబ్బ సొమ్మా? ఎక్కడి నుంచి తెచ్చావు?” అని ఘాటుగా ప్రశ్నించారు. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా అవినీతికి పాల్పడుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన నిలదీశారు.
గాంధీ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా రేవంత్? గాంధీ కుటుంబానికి ఇచ్చేందుకు పైసలు ఉంటాయి కానీ రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు పైసలు లేవా?రేవంత్ రెడ్డి ఇంత బాహాటంగా అవినీతి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ఏం పీకుతుంది? మోడీ చెప్పాక కూడా ఈడీ, సీబీఐలు… pic.twitter.com/AF2i9NK8uo
— BRS Party (@BRSparty) February 24, 2026