కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టే నీచ చరిత్ర.. కాంగ్రెస్‌ది: కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 3 March 2025 10:51 AM IST
కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టే నీచ చరిత్ర.. కాంగ్రెస్‌ది: కేటీఆర్
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. SLBC లో సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం, 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తిచేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కనబెట్టి, తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం కేటీఆర్ ఫైర్ అయ్యారు. కనీస ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి, నాలుగు రోజులు కాకముందే ఎనిమిది మంది అమాయకుల నిండు ప్రాణాలను ఫణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదేనని ఆరోపించారు.
మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లైతే, 2005-2014 వరకున్న గత కాంగ్రెస్ సర్కారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లేనని, సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా, ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు రూ.3300 కోట్ల ఖర్చుచేస్తే, బీఆర్ఎస్ పాలనలో రూ.3900 కోట్ల పనులు పూర్తిచేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
గత కాంగ్రెస్ సర్కారుకన్నా రూ.600 కోట్లు ఎక్కువ ఖర్చుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడున్నరేళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా, ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలా లేవని, రైతులకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాకుండా.. గల్లీ నుంచి ఢిల్లీదాకా కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని అర్ధాంతరంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి ముందు మరో మార్గం లేదని, ఈ “డ్యామేజ్ డైవర్షన్” కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని అన్నారు.